భారతదేశానికి చెందిన డీఆర్‌డీఓ మరియు రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్, అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది.

భారతదేశానికి చెందిన డీఆర్‌డీఓ మరియు రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్, అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది. టెక్నికల్ మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15 శాతం ఖాళీలను అగ్నివీరులకు కేటాయించగా, భద్రతకు సంబంధించిన విభాగంలో కనీసం 50 శాతం పోస్టులను వీరితో భర్తీ చేయనుంది. ఈ మేరకు బ్రహ్మోస్ సంస్థ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

బ్రహ్మోస్ సంస్థ తెలిపిన విధంగా, ‘‘సైనిక, సాంకేతిక మరియు క్రమశిక్షణ విషయంలో అగ్నివీరులు పొందిన శిక్షణ భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రక్షణ, పారిశ్రామిక రంగాలకు ఎంతో ఉపయోగపడనుంది. 2047కు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో, మాలాంటి సంస్థల్లో వారి సహకారం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది’’ అని పేర్కొంది.

ఈ ప్రకటన హరియాణాలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వెలువడడం గమనార్హం. ఆ రాష్ట్రం అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2022లో త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి మోదీ సర్కారు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. నాలుగేళ్లు ముగిసిన అనంతరం సర్వీస్‌ నుంచి తప్పుకొన్న అగ్నివీర్‌లకు పెన్షన్ సౌకర్యాలు ఉండవు. 25 శాతం మందినే తిరిగి సైనిక విధుల్లో కొనసాగిస్తారు.

ఈ పథకంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి, మిగతా 75 శాతం అగ్నివీర్‌ల పరిస్థితి ఏంటని ప్రశ్నించాయి. కేంద్ర బలగాలు మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించగా, బీఎస్‌ఎఫ్ చీఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ వారికోసం 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నామని తెలిపారు.

హరియాణా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తమ పోలీసు బలగాల్లో కూడా వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. మరోపక్క, అగ్నిపథ్‌ను సమీక్షించాలన్న డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఆ పథకంలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఉంది.

VOA Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *