కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1064 టన్నుల బియ్యంతో నిండిన షిప్ను స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. “కాకినాడ పోర్టు స్మగ్లర్లకు స్వర్గధామంగా మారింది. ఇక్కడ బియ్యం మాత్రమే కాదు, ఇతర ప్రమాదకర పదార్థాలు కూడా అక్రమ రవాణా అవుతున్నాయి. ఇది దేశ భద్రతకు పెద్ద ముప్పు,” అని ఆయన అన్నారు.
అక్రమ రవాణా పై పోర్టు అధికారుల నిర్లక్ష్యం దేశ భద్రతకు హాని కలిగించే ప్రమాదాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. “ఇది కేవలం రేషన్ బియ్యం మాత్రమే కాదు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలు కూడా స్మగ్లింగ్ అవుతాయంటే ఏంటి?” అని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్, స్మగ్లింగ్ వ్యవహారాన్ని కఠినంగా ఎదుర్కొనాలని, క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసి చర్యలు తీసుకోవాలని కోరారు. “ప్రతిసారీ ప్రజాప్రతినిధులు వచ్చి ఆపితేనే చర్యలు తీసుకుంటారా?” అని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం, కాకినాడ యాంకరేజ్ పోర్టులో 1064 టన్నుల బియ్యం స్మగ్లింగ్ వ్యవహారాన్ని స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి వివరాలను వెల్లడించారు.
పవన్ కళ్యాణ్, కాకినాడ పోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలు కేంద్రం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. “రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలి. దీని వెనుక ఉన్న రేషన్ మాఫియా, బోటు ఓనర్లు, అక్రమ రవాణా కారులు ఎవ్వరైనా, కఠినంగా చర్యలు తీసుకుంటాం,” అని ఆయన ధ్వజమెత్తారు.
“కాకినాడ పోర్టు స్మగ్లింగ్ హబ్ గా మారింది. దీని వెనుక ఉన్నంత పెద్ద నెట్వర్క్ను ధ్వంసం చేస్తాం,” అని పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పారు.