పోలవరం ఎత్తు తగ్గించారా చంద్రబాబు? ప్రజల్ని మోసం చేసినట్టే!” – అంబటి ఫైర్

విజయవాడ, ఏప్రిల్ 4: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై రాజకీయ రచ్చ రేగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో గుప్త ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

“ఆనకట్ట అసలు ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం 41.15 మీటర్లకే కుదించారు. కేంద్రం చెప్తే చంద్రబాబు ఓకే అన్నాడు. పోరాడాల్సింది పోరాడకుండా, చేతులు జారేసుకున్నాడు,” అని అంబటి ధ్వజమెత్తారు.

జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని ధృవీకరించారని పేర్కొన్నారు. “పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు. నీటి అవసరాలకు, సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకు ఉపయోగపడే ప్రాజెక్ట్‌ని చంద్రబాబు తక్కువ ఎత్తుతో పూర్తి చేయాలంటూ కేంద్రానికి లొంగిపోయాడు. ఇది మరి మోసం కాదా?” అని ప్రశ్నించారు.

“అప్పుడు హోదా కావాలన్నా, చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అన్నాడు. ఇప్పుడు పోలవరం విషయంలోనూ అదే డ్రామా. ఏదో తన రాజకీయ లాభాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు,” అని ఆరోపించారు.

కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఎవ్వరూ ఈ విషయాన్ని లేవనెత్తలేదని మండిపడ్డారు. “ఈ బీజేపీకి సపోర్ట్ చేసే టీడీపీకి ఎందుకు గొంతు కనిపించట్లేదు? చంద్రబాబు మరో డీల్ కోసం పంటదారులు మార్చారా?”

అంతేకాదు, వైఎస్ షర్మిల గురించి కూడా అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎప్పుడైనా చంద్రబాబు ఇబ్బందుల్లో పడితే వెంటనే షర్మిల బయటకు వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తుంది. ఇది అంతా టీడీపీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఆమెను డైవర్షన్ టూల్‌లా వాడుకుంటున్నారు,” అని ఆరోపించారు.

వకాఫ్ బిల్లుపై వైఎస్సార్సీపీ సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించిందని చెప్పారు. “ఈ బిల్లు మైనారిటీలకు హాని చేస్తుంది. అందుకే పార్లమెంటులో రెండు సభలలోను వ్యతిరేకించాం. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి గారు స్టాండ్ తీసుకున్నారు,” అని చెప్పారు.

“ఇంకెన్నిసార్లు చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టతారు? ప్రజలు ఈసారి చూస్తున్నారు,” అని అంబటి స్పష్టం చేశారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *