ఏపీ@6 నెలల కూటమి పాలన.. 1.12 లక్షల కోట్ల అప్పు

– 6 నెలల్లో రూ.1,12,750 కోట్ల అప్పు
– రాష్ట్ర చరిత్రలో రికార్డ్ స్థాయికి చేరిన కూటమి ప్రభుత్వం అప్పులు

అంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.1,32,079 కోట్లు, అవి 2019 నాటికి రూ.3,13,018 కోట్లకు చేరుకున్నాయి. అంటే విభజన తరువాత అధికారం చేపట్టిన టీడీపీ హయాంలో 19.54 శాతం అప్పు పెరిగింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి అంటే 2024 నాటికి రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు, అంటే అప్పులో మరో 15.61 శాతం పెరిగాయి.

రాష్ట్ర విభజన తరువాత మూడవ ప్రభుత్వంగా అధికారం చేపట్టిన కూటమి సర్కారు రాష్ట్ర చరిత్రలో కేవలం ఆరు నెలల కాలంలో రికార్డ్ స్థాయిలో రూ.1,12,750 కోట్ల అప్పు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు ఇంకా 3 నెలలు మిగిలే ఉండటంతో ఈ అప్పు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త ప్రభుత్వంలో ప్రతి నెలా అప్పు తప్పనిసరి!

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా అప్పు తెస్తోంది. అధికారం చేపట్టిన రెండు వారాల్లోనే కూటమి సర్కారు జూన్‌ 24న రూ.6 వేల కోట్లు, జూలై 24న రూ.10 వేల కోట్లు, ఆగస్టులో రూ.3 వేల కోట్లు, సెప్టెంబరులో రూ.4 వేల కోట్లు, అక్టోబరులో రూ.6 వేల కోట్లు, నవంబరులో రూ.4 వేల కోట్లు, డిసెంబరులో రూ.9,237 కోట్ల అప్పు చేసింది.

ప్రభుత్వ గ్యారెంటీలతో తీసుకున్న రుణాలు ఇవే..

ప్రభుత్వ గ్యారెంటీలతో ఈనెల 20న ఏపీ మార్క్‌ఫెడ్, ఎన్సీడీసీ ద్వారా రూ.1000 కోట్లు, ఈనెల 26న మార్క్‌ఫెడ్‌ ఎన్సీడీసీ ద్వారా మరో రూ.1800 కోట్లు, జూలై 19న రూ.3200 కోట్లతో పాటు, వివిధ బ్యాంక్‌ల నుంచి పౌర సరఫరాల సంస్థ పేరుతో జూన్‌ 28న రూ.2 వేల కోట్ల అప్పు చేయగా, ఇప్పుడు ఏపీ ఎండీసీ ద్వారా మరో రూ.5 వేల కోట్లు ఇవన్నీ కలిపి రూ.13 వేల కోట్ల అప్పు తెచ్చింది.

అమరావతి కోసం మరో రూ.31 వేల కోట్ల కొత్త అప్పు

అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్‌ ద్వారా రూ.15 వేల కోట్లు అప్పు తీసుకుంటున్నారు. దీంతో పాటు హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, జర్మన్‌ బ్యాంక్‌ ద్వారా మరో రూ.5 వేల కోట్లు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసుకుంది. మొత్తంగా అమరావతి కోసం చేసిన చేయబోతున్న అప్పు రూ.31 వేల కోట్లకు చేరింది.

మొత్తం 6 నెలల కాలంలో 3 కేటగిరిల్లో కూటమి ప్రభుత్వం రూ.1,12,750 కోట్ల అప్పు చేసింది. గతంలో ఏ ప్రభుత్వమూ 6 నెలల్లో ఇంత అప్పు చేసింది లేదు. అంతే కాకుండా బడ్జెట్‌లో ద్రవ్యలోటును రూ.68,742 కోట్లుగా చూపడం రాష్ట్ర ప్రజలపై మరింత అప్పు భారం పడే అవకాశాన్ని తెలుపుతోంది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *