వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి – 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు. కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీలలో ఒకరు. ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎంపీ అయిన 4 నెలలకే ఆయన తండ్రిగారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన జీవితమే మారిపోయింది. తండ్రి మరణం తర్వాత ఆయన ముఖ్యమంత్రవ్వాలి అనుకోవడం, నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అందుకు ససేమీరా అనడం, తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన చరిష్మాను కాపాడుకోవడం కోసం జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించడం జరిగిపోయాయి.
జగన్ తమను ఎదిరించి ఓదార్పు యాత్ర చేయడం సహించలేని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని పార్టీ నుండి వెళ్లిపోయేలా చేసింది. అక్రమ ఆస్తుల కేసులు మోపి సీబీఐ, ఈడి వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను జగన్ మీదకి వదిలింది. సరిగ్గా ఇక్కడే జగన్ ఒక హీరో అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి తన సొంత పార్టీ మొదలెట్టడం, జైలును లెక్కచేయకపోవడం, సమైఖ్యఆంధ్రా కోసం పార్లమెంట్ లో పోరాడడం లాంటివి జగన్ని యువతలో ఒక పోరాట యోధునిగా, హీరోగా నిలిపింది. జగన్ కున్న ఆ ఇమేజ్ 2019లో ఆయన్ని సీఎం పీఠం మీద కుర్చోపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.
సీన్ కట్ చేస్తే, 2024లో జగన్ కి యువతకు మధ్య భారీగా గ్యాప్ పెరిగిపోయింది. ఏ యువత ఐతే జగన్ కోసం పోరాడారో, వారే ఇప్పుడు జగన్ను పట్టించుకోవడం మానేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తన మాస్ ఇమేజీని పక్కనపెట్టి, తాడేపల్లి ప్యాలస్ కే పరిమితమయ్యారు. దాంతో ఆయనకు ప్రజలతో, ముఖ్యంగా యువతతో కనెక్షన్ పూర్తిగా దెబ్బతినింది.
యువతే లక్ష్యంగా.. టీడీపీ, జనసేన క్యాంపెయిన్లు
రాష్ట్రంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేనలు యువతని తమ ప్రధాన ఆయుధంగా మార్చుకున్నాయి. ఏడు పదుల వయసు దాటిన చంద్రబాబు గారు గూగుల్ మీట్, టెక్నాలజీ, సెల్ ఫోన్ వంటి పదాలను వాడుతూ యువతకు మరింత దగ్గరయ్యారు. ఆయన కుమారుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయత్రనే చేశారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సినిమా ఛరిష్మాని పూర్తిగా వాడుకున్నారు. సినిమా స్టైల్ ప్రసంగాలతో యువతను భారీగా ఆకర్షించారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం తానసలు ఫోనే వాడనని, బయట ఏం జరుగుతుందో తనకు తెలియవనేలాగా ఉన్నారు. ఆంధ్ర యువత ఎంతగానో అభిమానించే సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో గొడవలు పడి యువతకు వ్యతిరేకమయ్యారు. అదే జగన్ నమ్ముకున్న అక్క చెల్లెమ్మలు ఓట్లు కూడా ఆయనకు రాకుండా చేశాయి.
నేటికీ మారని పార్టీ పరిస్థితి
ఎన్నికలు జరిగి దాదాపు ఏడు నెలలు కావొస్తున్నా వైసీపీ అధినేత వ్యవహారశైలిలో పెద్దగా మార్పు కనిపించడం లేడు. టీడీపీ జనసేన కలిపి సోషల్ మీడియాలో 600 పై చిలుకు పేజీలు నడుపుతూ యువతలో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా, వారిని తమవైపే ఉంచుకునే పనిలో ఉంటే, వైసీపీ మాత్రం సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవడానికే అష్టకష్టాలు పడుతుంది. ఎన్నికలు జరిగి 7 నెలలైనా టీడీపీ జనసేనలు విపరీత ట్రోల్ల్స్ తో, మీమ్స్ తో జగన్ పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే వైసీపీకు యువత మద్దతును సంపాదించడం మరింత కష్టంగా మారుతుంది.