గుంటూరు వైద్య కళాశాలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కు చేదు అనుభవం

శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన రఘుబాబు అనే వ్యక్తి పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్‌ విషయంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్‌ ను ప్రశ్నించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను యూనివర్సిటీ వారు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని, దీని వల్ల వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన మంత్రి ముంగిట తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఆలిండియా కౌన్సెలింగ్‌ ప్రారంభానికి ముందే ఫ్రీ ఎగ్జిట్ క్లోజ్

యూనివర్సిటీ వారు మొదటి కౌన్సెలింగ్‌ సమయంలో ఒక ఆర్డర్, రెండో కౌన్సెలింగ్‌ సమయంలో మరో ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆలిండియా కౌన్సెలింగ్‌ ఇంకా ప్రారంభం కాక ముందే మూడో కౌన్సెలింగ్‌కు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేస్తూ, ఫ్రీ ఎగ్జిట్‌కు శుక్రవారం నుంచి సోమవారం ఉదయం వరకు అవకాశం ఇచ్చారు. సోమవారం క్లోజ్‌ చేయడం వల్ల ఆలిండియా కోటాలో ఏపీ వైద్య విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతారని తల్లిదండ్రుల నుండి ఆందోళన వ్యక్తం అవుతుంది. మేనేజ్‌మెంట్‌ పీజీ కోటా వారికి మేలు జరిగేలా హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోందని కొంత మంది ఆరోపించారు.

మొదటి కౌన్సెలింగ్‌ అయ్యాక, కోర్టు తీర్పు వల్ల జీవో 56ను కొట్టేసారు. దీనితో వైద్య విద్యార్థుల ఫీజులు పెరిగాయి. పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పందిస్తూ, కోర్టు తీర్పు వల్ల ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. అన్ని ఆలోచించి విద్యార్థులకు ఏది లాభమో అదే చేస్తామని తెలిపారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *