ఏపిలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో తెచ్చిన పథకంలో తల్లులకు అన్యాయం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాది పథకం అములు లేనట్లే అని క్యాబినెట్ డిసైడ్ చేసింది. కీలకమైన ఈ పథకానికి నిధులు కేటాయింపులు చేయలేదు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారణం.. తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం అమలు చెయ్యట్లేదనే వార్త బయటకు రావడమే. దీన్ని 2025 విద్యా సంవత్సరం నుంచి అమలు చెయ్యాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే.. 2025 జూన్‌లో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మరి 2024 విద్యా సంవత్సరం సంగతేంటి? ఈ విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బు సంగతేంటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
తల్లికి వందనం పథకం కింద.. ప్రతీ విద్యార్థికీ రూ.15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక, మొదటి విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చెయ్యట్లేదని తాజాగా క్యాబినెట్ నిర్ణయంతో స్పష్టమైంది. ఈ పథకం అమలవుతుందనే ఆలోచనతో.. చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లల స్కూళ్ల ఫీజుల కోసం అప్పులు చేశారు. ఈ పథకం డబ్బు వస్తే, ఆ అప్పులు తీర్చుదామని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఈ పథకాన్ని అమలుకు బ్రేక్ లు వేసింది. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం హామీ మేరకు ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం కింద రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే పథకం ఇవ్వకుండా ఒక ఏడాది గడిపేస్తున్న ప్రభుత్వం.. కుటుంబం యూనిట్ గా కాకుండా విద్యార్థి యూనిట్ గా పథకం అమలుపై తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి.