తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి విషయంపై మాట్లాడారు.
“ఎన్డీయే, చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఎక్కడ తప్పు జరిగినా స్పందించాలి అనేది నా నమ్మకం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై బాధితుల్ని పరామర్శించాను, క్షమాపణలు కూడా కోరాను. ఇది మా అందరి సమిష్టి బాధ్యత” అని పవన్ పేర్కొన్నారు. తిరుపతి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పవన్ తెలిపారు. “ఇది నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నాను, కానీ ఘటన దృష్ట్యా వేడుకలను తగ్గించాం” అని పవన్ వెల్లడించారు. ఎక్కడైనా తప్పు జరిగితే అది తమ అందరి సమష్టి భాద్యతని, అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పానని పవన్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Also read: https://voiceofandhra.org/telugu/2025/01/10/tirupati-tokki-salata-jana-sena-entry-tragedy/