దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సు లో సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాలలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసినట్లు తెలిపింది.
“ఉక్కు, సౌరశక్తి, ఆటో మొబైల్ మరియు సిమెంట్ వంటి కీలక రంగాలలో పెట్టుబడులు పెట్టే JSW స్టీల్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం, గడ్చిరోలిని భారతదేశపు ‘ఉక్కు నగరం’గా అభివృద్ధి చేయాలనే మా దార్శనికతను నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన అడుగు” అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు.
ప్రశ్నార్థకంగా మారిన కడప స్టీల్ ప్లాంట్ భవిష్యత్!
2023 ఫిబ్రవరిలో రూ.8,800 కోట్ల పెట్టుబడితో కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు నాటి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. జిందాల్ సంస్థ కూడా పనులు మొదలు పెట్టింది. 2024లో జరిగిన ఎన్నికలలో ప్రభుత్వం మారడంతో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి.
సజ్జన్ జిందాల్ సహా కొంతమంది బడా పారిశ్రామికవేత్తలను హనీ ట్రాప్ చేసి, ఆస్తులు కొల్లగొట్టాలని ప్రయత్నించిన ఒక సినీ నటిని తెరపైకి తెచ్చి, వ్యాపారవేత్తలపై, ఐపీఎస్‌లపై కేసులు పెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన జిందాల్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విసిగి, మహారాష్ట్రకు తరలిపోతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
గతంలో జగన్ హయాంలో పెట్టుబడులు తరలిపోతున్నాయని గగ్గోలు పెట్టిన వారు నేడు కళ్ల ముందే తరలిపోతున్న జిందాల్ స్టీల్ ప్లాంట్ గురించి ఎలా స్పందిస్తారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.