ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి సంబంధించి రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం బీజేపీ స్ట్రాటజీ సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఈ సీటును మేగాస్టార్ చిరంజీవి లేదా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజ్యసభ సీటు బీజేపీకే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే ఈ రాజ్యసభ సీటు అధికార కూటమి పార్టీలలో ఒకదానికే వెళ్లే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏ పార్టీకి ఈ అవకాశం దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సీటు బీజేపీకే దక్కనుందని సమాచారం.
బీజేపీకి దగ్గరవుతున్న చిరంజీవి
తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రశ్రేణి హీరోగా వెలుగొందిన చిరంజీవి గత కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా, అనకాపల్లి ఎంపీ సీటుకు బీజేపీ అభ్యర్థి సిఎం రమేశ్‌కు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు. అలాగే, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని తరువాత ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.
రాజ్యసభకు కిరణ్ కుమార్ రెడ్డిని పంపే ఆలోచనలో బీజేపీ?
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఈ రాజ్యసభ సీటుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రాజంపేట నుంచి బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. అయితే, ఆయన గెలిచివుంటే కేంద్ర మంత్రిపదవి దక్కే అవకాశముందని అప్పట్లో బలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజ్యసభ సీటు ఖాళీ అవడంతో కిరణ్ కుమార్ రెడ్డిని పంపేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/01/29/anantapur-narayana-college-student-protest/