ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవర్తన, నియోజకవర్గాన్ని పట్టించుకోని తీరు, అనుచరుల దౌర్జన్యం వల్ల పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు ఇచ్చిన కాకర్ల, విజయం సాధించిన తరువాత పూర్తిగా గాడితప్పారు. నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు.
పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరు – అభిమానులను నిరాశపరిచిన కాకర్ల
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కాకర్ల అమెరికా ప్రయాణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీకి అత్యంత ప్రాధాన్యమైన నందమూరి తారకరామారావు వర్థంతి వంటి కీలక సందర్భాల్లో కూడా హాజరుకాలేదు. కానీ తన వ్యక్తిగత వ్యవహారాల కోసం మాత్రం రెగ్యులర్గా ప్రత్యక్షమవుతుండటంతో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర అసహనం పెరిగింది.
అనుచరుల చేతిలో అవినీతి – ఇసుక, రేషన్, భూముల దోపిడీ
కాకర్ల సురేష్ అనుచరులపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- ఇసుక మాఫియా – అక్రమ తవ్వకాలు భూమిని దెబ్బతీస్తున్నాయి.
- రేషన్ బియ్యం స్కాం – వేలాది బస్తాలు ఎక్కడికి పోతున్నాయో ఎవరికీ తెలియదు.
- ప్రభుత్వ భూముల అక్రమ కబ్జా – ప్రభుత్వ స్థలాలను తన అనుచరులకు అప్పగించి భూదందాకు ఊతమిచ్చారు.
- CID పరిధిలోని అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా జామ్ ఆయిల్ చెట్ల తొలగింపు
ప్రజలు పలు ఫిర్యాదులు చేసినా ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది.
ఎన్నికల హామీలు గాల్లో – మూతబడిన ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
ఎన్నికల ముందు కాకర్ల ట్రస్ట్ పేరిట వైద్య శిబిరాలు, నైపుణ్య శిక్షణ, అన్న క్యాంటీన్ అంటూ హడావుడి చేసిన ఆయన, గెలిచిన వెంటనే వాటిని పూర్తిగా మూసేశారు. ప్రజలు “ఇది ఓటు కోసం వేసిన నాటకమే” అని తెగేసి చెబుతున్నారు.
అమెరికాలో లీగల్ ఇష్యూలు – ఆంధ్రాలో డబ్బు దోచుకోవడానికి ప్రణాళిక?
అమెరికాలోని తన సోదరుడు కాకర్ల సునీల్ వెటర్నరీ ఆసుపత్రులకు ఉద్దేశించిన కోవిడ్ ఉద్దీపన నిధులను మోసపూరితంగా మళ్లించడం ద్వారా కాకర్ల సురేష్ ట్రస్ట్ కార్యకలాపాలకు మరియు ఎన్నికల ఖర్చులకు నిధులు సమకూర్చుకున్నాడు అని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు, అమెరికన్ అధికారుల విచారణకు భయపడి, చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి కాకర్ల సోదరులు ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా సంపాదించిన నిధులను తిరిగి అమెరికాకు మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పార్టీ సీనియర్లను పక్కనపెట్టి విభేదాలకు తెరతీశారు
ఎన్నికల సమయంలో గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, కంబం విజయరామిరెడ్డి లాంటి నేతలను కాకర్ల పూర్తిగా పక్కనపెట్టారు. వీరి ఫొటోలు పార్టీ బ్యానర్లకు కూడా అనుమతించకపోవడం, కార్యకర్తల్లో మరింత విబేధాలకు దారి తీసింది.
చంద్రబాబు నాయుడు అసలు బొల్లినేనినే టికెట్ ఇవ్వాలని భావించారు. కానీ నారా లోకేష్ అమెరికా టూర్లలో కాకర్లతో ఏర్పరుచుకున్న సంబంధాలు, టీడీపీ అభ్యర్థిత్వంపై ప్రభావం చూపించాయి. లోకేష్ ఒత్తిడితోనే కాకర్లకు టికెట్ దక్కిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రజల్లో మండి పడుతున్న విమర్శలు
కాకర్ల సురేష్ తన నియోజకవర్గ ప్రజలను పూర్తిగా విస్మరించడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఆయన కుమారుడు ఇటీవల గ్రామాల్లో పర్యటించినా, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆ పర్యటన కూడా విఫలమైంది.
- స్వగ్రామమైన ఎర్రం రెడ్డిపల్లెకు ఒక్కసారి కూడా వెళ్లలేదు.
- గాండిపల్లె గ్రామంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నా మద్యం దుకాణానికి అనుమతి ఇచ్చారు.
ఈ పరిస్థితిలో టీడీపీ కార్యకర్తలు “ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది” అని హెచ్చరిస్తున్నారు.
టీడీపీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందా?
చంద్రబాబు నాయుడు టీడీపీని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిర్లక్ష్యం, అక్రమాలు పార్టీకి తీవ్రంగా దెబ్బ కొడుతున్నాయి.
ఈ పరిస్థితిని అధిష్టానం గమనించి త్వరగా చర్యలు తీసుకోకపోతే, ఉదయగిరిలో టీడీపీకి చేదు అనుభవాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు!