గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాదిన పాగావేయాలని చూస్తున్న బిజెపి కేవలం కర్ణాటకలో మాత్రమే తన ప్రభావాన్ని చూపగలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో జనసేనని పవన్ కళ్యాణ్ ని వాడుకొని తమ ప్రభావాన్ని విస్తరింపజేసేటందుకు కొత్త మాస్టర్ ప్లాన్ వేసింది.
పవన్ ని సనాతన ధర్మ పరిరక్షకుడిగా చూపుతూ అతనికి ఉన్న సినీ చరిష్మాని వాడుకొని దక్షిణాదిన ఎదగడానికి పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా గతంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు నెలకొల్పాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు దీనికి మద్దతు కూడకట్టడానికి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ హైందవ పుణ్యక్షేత్రాలని సందర్శించబోతున్నారు, మరీ ముఖ్యంగా వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న తమిళనాడు మరియు కేరళ లో ఈ పర్యటన కొనసాగనుంది.
ఇప్పటికే రహస్య సింగపూర్ పర్యటనలో ఉన్న పవన్ తిరిగి రాగానే కేరళ త్రివేండ్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం నుండి ఈ పర్యటన ప్రారంభిస్తారని జనసేన వర్గాలు తెలుపుతున్నాయి. తర్వాత కొచ్చి, గురువాయూర్, త్రిసూర్ లో పర్యటించి ఆ తర్వాత తమిళనాడులోని అరక్కోణం మధురై లో పర్యటన కొనసాగిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ ని ఉపయోగించుకున్న బిజెపి కేరళ మరియు తమిళనాడులో ఇదే వ్యూహాన్ని అవలంబించాలని అనుకుంటుంది. అయితే పవన్ ఇమేజ్ ని పెంచి లాభపడాలని చూస్తున్న బిజెపి ఎత్తుగడ టిడిపిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ భవిష్యత్తుకి పవన్ ఎదగడం మంచి పరిణామం కాదు అని చంద్రబాబు సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది.
టిడిపిని పూర్తిగా పక్కకు పెట్టి జనసేనను తమకు అత్యంత సమీప మిత్రపక్షంగా మలుచుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవాలని బిజెపి వేస్తున్న ఎత్తుగడను పసికట్టిన చంద్రబాబు, ఓ పక్క బిజెపి పవన్ ఇమేజ్ ని పెంచాలని చూస్తుంటే, అది జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల ఇచ్చిన మంత్రుల పనితీరు ర్యాంకింగ్లో పవన్ ని చంద్రబాబు తనకంటే మరియు లోకేష్ కంటే వెనుక స్థానంలో ఉండేలా పదవ ర్యాంకుకు పరిమితం చేశారు. అలాగే పవన్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు అని ఉన్నతాధికారుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
మొత్తానికి పవన్ ని పావుగా వాడుకొని బిజెపి వేస్తున్న రాజకీయ ఎత్తుగడను, చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు? అనే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను రసవత్తరంగా మార్చనుంది.