ఆ ఇళ్ల స్థలాలు అమ్మినా.. కొన్నా ఇళ్ల పట్టాలు రద్దు
కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందిన అనర్హులను గుర్తించే ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్వే ప్రక్రియ మొదలు పెట్టాలని కలెక్టర్లు మండల అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఎంత మందికి ఇళ్లు, స్థలాలు కేటాయించిందన్న వివరాలు ఇప్పటికే రెవెన్యూ అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నాయి. లబ్దిదారుల పూర్తి వివరాలతో జాబితా రెడీగా ఉంది. తాజాగా ప్రభుత్వం అధికారులకు 5 రోజుల గడువు విధించింది. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకూ సంపూర్ణంగా సర్వే చేసి నివేదిక అందించాలని ఆదేశించింది. దీంతో కలెక్టర్లు సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలు, మండలాల్లో ఎవరెవరు లబ్ధిదారులుగా ఉన్నారో, వారు సమర్పించిన పత్రాలన్నింటినీ క్రాస్ చెక్ చేస్తున్నారు.
ఇళ్ల స్థలాల వద్దకు నేరుగా అధికారులు
ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన అనంతరం, అధికారులు గ్రామాలకు వెళ్లి లబ్దిదారులను స్వయంగా కలుసుకుంటారు. వారు నిజమైన లబ్దిదారులా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకుంటారు. ఆయా ఇంటి స్థలాలు నిజమైన లబ్ధిదారుల వద్దే ఉన్నాయా లేదా ఒక వేళ ఆ స్థలాలను అమ్ముసుకున్నారా అనే విషయాలను పరిశీలిస్తారు. అదనంగా లబ్దిదారుల ఐడీ ప్రూఫ్‌లు, పత్రాలను మళ్లీ పరిశీలిస్తారు.
ఇళ్ల స్థలాలు పొందిన వ్యక్తులు, వాటిని ఇప్పటికీ కలిగి ఉన్నారా లేదా అమ్మేశారా అనే అంశాన్ని కూడా గుర్తిస్తారు. అమ్మిన స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనుంది.
రిపోర్ట్ అనంతరం చర్యలు
సర్వే పూర్తయిన 5 రోజుల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం లబ్దిదారులపై చర్యలు తీసుకుని ఇళ్ల స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఆ తరువాత ఆయా స్థలాలను చదును చేసి కొత్త లబ్ధిదారులకు అందించనుంది. దీంతో గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది లబ్దిదారులకు ఇళ్లు లేనివారుగా మారనున్నారు.