చిత్ర దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సుగాలి ప్రీతి కేసు ఏమయింది? 30 వేల మంది మహిళల మిస్సింగ్ కేసు ఏమయింది?” అంటూ పవన్‌ను నిలదీశారు.
తన రాజకీయ ప్రవేశం సమయంలో పవన్ కళ్యాణ్, సుగాలి ప్రీతి అత్యాచారం కేసును ప్రస్తావిస్తూ న్యాయం అందిస్తామని హామీ ఇచ్చారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. కానీ, ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నా ఈ కేసుపై ఏ చర్యలు తీసుకోలేదు అంటూ మండిపడ్డారు.
అలానే, “30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ మీరు చేసిన ఆరోపణలు ఏమయ్యాయి? ఇప్పుడు అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టిందా?” అంటూ విమర్శలు గుప్పించారు.
తమ్మారెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను ఒత్తిడిలోకి తీసుకురావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు.
ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ & జనసేన నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.