- ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు
- ప్రజాసమస్యలపై చొక్కా పట్టుకుని నిలదీస్తాం
- వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దుర్మార్గం: అసెంబ్లీ బయట వైయస్ఆర్ సీపీ నేతలు
సభలో వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, ప్రజల గొంతును నొక్కేయాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైయస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి, అనంతరం సభ నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్ సీపీ నేతలు, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలోని వైఫల్యాలను ఎత్తి చూపుతారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.
ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం: బొత్స సత్యనారాయణ
“రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. కానీ కూటమి ప్రభుత్వం తమ అధికారాన్ని బలపరచుకునేందుకు ప్రతిపక్షాన్ని అణిచివేయాలని చూస్తోంది. గవర్నర్ ప్రసంగంలోనే మేము ప్రతిపక్ష హోదా కోరాం. కానీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. మిర్చి రైతుల సమస్యలపై, ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికీ సమాధానం చెప్పదనే స్పష్టంగా తెలుస్తోంది. మేం ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం, ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతాం.” అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
“ఏపీలో తాలిబన్ పాలన సాగుతోంది”: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, “ప్రపంచంలో తాలిబన్ పాలన సాగుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ను మినహాయిస్తే, ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం లేకుండా పాలన సాగడం లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను తాలిబన్ పాలన మాదిరిగా మార్చేసింది. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష గళాన్ని నొక్కేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహం.” అని ఆరోపించారు.
“మీడియా సంస్థలపై ఎంట్రీ నిషేధం దారుణం”: తాడిపర్తి చంద్రశేఖర్
“ప్రజాస్వామ్య దేశంలో మీడియా గొంతు నొక్కడం దారుణం. ప్రజలకు నిజాలను తెలియజేయడమే మీడియా బాధ్యత. కానీ వైఫల్యాలను ఎత్తి చూపుతారనే భయంతోనే ప్రభుత్వం ముఖ్యమైన మీడియా సంస్థలను నిషేధించింది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య.” అని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు.
“దేశంలో ఎక్కడా ప్రతిపక్షం లేని రాష్ట్రం లేదు”: వరుదు కళ్యాణి
“ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రతిపక్షం లేకుండా పాలన సాగుతోంది. గతంలో ఢిల్లీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చోననే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ఈ చర్యలను ప్రజలు చూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయక, ప్రజలను మోసం చేస్తున్నారు. మేం వీటిని ప్రశ్నించకుండా ఊరుకోము.” అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజాస్వామ్యం ఎలా?
వైయస్ఆర్ సీపీకి 41% ఓటు షేర్ వచ్చినా, కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని వైయస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. సభలో తమకు తగిన గౌరవం, సమయం కల్పించకపోతే ప్రజల్లోకి వెళ్లి పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.