Z+ భద్రత ఉన్న నేతకి ఇలా..? జగన్ పర్యటనలో ఘోర భద్రతా లోపం!

రామగిరి, ఏప్రిల్ 8, 2025 — రామగిరి పర్యటనలో జరిగిన ఘోర భద్రతా లోపంపై వైఎస్సార్సీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. Z+ భద్రత కలిగిన నేత అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరైన పోలీసు బందోబస్తు లేకపోవడం, హెలిప్యాడ్ దగ్గర ఉద్ధృతంగా గుమిగూడిన జనంతో హెలికాప్టర్‌కు నష్టం వాటిల్లింది.

జనం చుట్టుముట్టిన నేపథ్యంలో హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో పైలట్లు జగన్ గారిని తిరిగి ఎక్కించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన హెలికాప్టర్‌లో వెళ్లలేక, కార్యక్రమం ముగించుకున్న తర్వాత బెంగళూరుకు రోడ్డు మార్గంలో తిరిగిపోయారు.

“ఇది సాదారణ నిర్లక్ష్యం కాదు, కావాలని జరిగిన పని. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం చూస్తున్నాం,” అని పార్టీ ప్రతినిధులు మండిపడ్డారు. “ఒక మాజీ ముఖ్యమంత్రికి, లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచిన నాయకుడికి ఇలా భద్రత లేకుండా వదిలేయడం చూస్తుంటే ఇది రాజకీయ కుట్రే అనిపిస్తోంది.”

వైఎస్సార్సీపీ గుర్తు చేసిన మరో ఉదంతం — ఫిబ్రవరి 19, 2025న గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులకు మద్దతుగా జగన్ గారు వెళ్లినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను నియమించలేదు. ముందుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం విచారకరం అని విమర్శించింది.

పార్టీ ఇప్పటికే ఈ విషయాలపై ప్రధానమంత్రి గారికి జూన్ 7, జూలై 18 (2024) తేదీల్లో, అలాగే హోం మంత్రి గారికి మార్చి 6, 2025న లేఖలు రాసి, జగన్ భద్రత తగ్గిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వివరించింది.

“ఈ ప్రభుత్వం చేస్తున్నది కేవలం జగన్ గారిని కాదు, ఆయనను నమ్మే కోట్లాది ప్రజల భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టి వేయడమే. ఇది మేం సహించం,” అని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

ఇక ఎన్నికల సమీపంలో ఈ తరహా కుట్రలు ప్రజల్లో ఆగ్రహం రేపుతాయని, ఈ యత్నాలు జగన్ గారి ప్రజాధారాన్ని బలపరచడమే తప్ప బలహీనపరచలేవని వైఎస్సార్సీపీ హెచ్చరించింది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *