ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో అటవీశాఖ అధికారులు మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఒప్పందం జరిగిందని అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గజరాజుల దాడులకు పరిష్కారం లభించినందుకు పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా, ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి, మావటీలకు కావటీలకు శిక్షణ, కుంకీ ఏనుగులను ఏపీకి తరలించడం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం, ఎర్రచందనం మరియు శ్రీగంధం సమస్యలపై జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అడవులలో జరుగుతున్న విషయాలను రియల్ టైంలో తెలుసుకునేందుకు ఐటీ అభివృద్ధి కూడా చేపట్టాలని నిర్ణయించారు.