కాంగ్రెస్ అగ్రనేత మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంస
లు కురిపించారు. ఆయన రాహుల్‌ను ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. ప్రజల్లో తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు రాహుల్ ఎంతో కష్టపడ్డారని సైఫ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు జాతీయ మీడియా నిర్వహించిన చర్చా వేదికలో చేశారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ నేతల గురించి చర్చ జరుగుతున్న సమయంలో, వ్యాఖ్యాత ‘ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు?’ అని అడిగారు. దీనికి సైఫ్ బదులిస్తూ, ‘ధైర్యంగా, నిజాయతీగా ఉండే నాయకులంటే ఇష్టం’ అని చెప్పారు. వ్యాఖ్యాత ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వంటి పేర్లను సూచించారు.
సైఫ్ స్పందిస్తూ, ‘‘వాళ్లంతా ధైర్యవంతులైన నాయకులే. అయితే, రాహుల్ గాంధీ తీరు నన్ను కాస్త ఎక్కువగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన చేసే పనులను కొందరు అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు. ప్రజల్లో ఆదరణ చూరగొనేందుకు చాలా కష్టపడ్డారు’’ అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైఫ్ ఇటీవల విడుదలైన ‘దేవర’ సినిమాలో భైర పాత్రలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను పొందింది.