కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ సేవ, దేశ నిర్మాణం, అభివృద్ధి కోసం ఒకప్పుడు ఉన్న రాజకీయాలు ఇప్పుడు పవర్ పాలిటిక్స్‌గా మారాయని పేర్కొన్నారు. రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడిన గడ్కరీ, ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ, ‘‘ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేసిన రోజుల్లో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నా. అప్పట్లో తగిన గుర్తింపు లేకపోవడం, గౌరవం ఉండకపోవడం జరిగింది. హరిభౌ కిసన్‌రావ్ బగాడే వంటి నేతలు ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశారు. నేను 20 ఏళ్ల పాటు విదర్భలో పార్టీ కార్యకర్తగా పనిచేశాను. అప్పట్లో మేం నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు రువ్వేవారు. ఎమర్జెన్సీ తర్వాత నా ప్రసంగాలకు వినియోగించే ఆటోను కొందరు తగలబెట్టారు’’ అని గుర్తుచేశారు.
గడ్కరీ మాట్లాడుతూ, ‘‘ఇవాళ నేను మాట్లాడుతుంటే వేలాది మంది ఇక్కడికి వచ్చి వింటున్నారు. నాకు దక్కిన ఈ గుర్తింపు వాస్తవానికి నాది కాదు, ప్రాణాలకు ఎదురొడ్డి మరీ కష్టపడిన హరిభౌ కిషన్ రావ్ వంటి కార్యకర్తలదే’’ అని అన్నారు.