ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సరోగసీ ద్వారా మాతృత్వం పొందాలనుకునే తల్లుల కోసం కొత్త వెసులుబాటును ప్రకటించింది. సరోగసీ ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు, పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు అందించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రకటన ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సరోగసీ ద్వారా సంతానం పొందితే వారికి 180 రోజుల మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. అలాగే, సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళలు కూడా ఈ సెలవులకు అర్హులుగా ఉంటారు. సెలవులు పొందాలంటే, రిజిస్టర్డ్ వైద్యుల లేదా ఆసుపత్రుల నుంచి సరోగసీ తల్లి మరియు కమిషనింగ్ తల్లీతండ్రి మధ్య ఒప్పందాన్ని సమర్పించాలి.
సరోగసీకి అర్హత కలిగిన దంపతులు చట్టబద్ధమైన వివాహం ద్వారా అయిదు సంవత్సరాలు కలిసి ఉన్న వారు కావాలి. భార్యకు 23-50 ఏళ్ల మధ్య వయస్సు, భర్తకు 26-55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే వారు సరోగసీ విధానాన్ని ఎంచుకోవచ్చు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా సరోగసీ ద్వారా మాతృత్వం పొందుతున్న వారికి సెలవుల ప్రయోజనాలను పొడిగించిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.