పతకాలు సాధించే క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాల పెంపు

పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆటలు ఆడేవాళ్లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు. ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.75 లక్షలు ఇస్తుండగా దీన్ని ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ. 30 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఒలంపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం సూచించారు. అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు, రజత పతకం సాధించిన వారికి రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

ఏషియన్స్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ ఫిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పథకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఒలంపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి గ్రూప్-1 ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపారు.

అమరావతిని స్పోర్ట్స్ సిటీగా రూపొందించడంతో పాటు తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. కడప, విజయవాడ, విజయనగరం క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విజయనగరం క్రీడా పాఠశాల గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత పాపులర్ అయిన స్పోర్ట్స్ లీగ్స్ లో ఏపీ నుండి జట్లు ప్రాతినిధ్యం వహించేలా చూడాలన్నారు. ఏపీకి వరంగా సముద్ర తీరం, కొండలు, అడవులు ఉన్నాయని మౌంటెయిన్ బైకింగ్, వాటర్ స్ప్రోర్ట్, నేచర్ ఫోటో గ్రఫీ, ట్రెక్కింగ్ వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని అన్ని ఆటలను ప్రోత్సహించాలని సిఎం అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయనిఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని సిఎం అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీసుకువచ్చిన విధానాల కారణంగా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారని వారు ఒలంపిక్స్ లో కూడా సత్తా చాటారని సిఎం అన్నారు. పిపిపి విధానంతో పాటు స్వచ్చంధంగా ఆసక్తి చూపే వ్యక్తులు, సంస్థల ద్వారా మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. ఈ సూచనల ప్రకారం మార్పులు చేసి కేబినెట్ లో నూతన పాలసీ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *