సిఎం చంద్రబాబు సన్నిహితుడిపై సైబర్ క్రైమ్ కేసు

ఏపీ సిఎం చంద్రబాబుకు సన్నిహితుడు, టీవీ5 ఛానెల్ చైర్మన్ BR నాయుడుపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. సదరు టీవీ ఛానెల్ లో డిసెంబర్ 17న జరిగిన ఒక ప్రత్యేక షోలో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయవాదులపై టీవీ5 అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. BR నాయుడుతో పాటు ఆ ఛానెల్ ఎండీ రవీంద్రనాథ్, యాంకర్ సింధూర శివ పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో డ్రగ్స్ కేసు.. ఇప్పుడు సైబర్ క్రైం కేసు

గతంలో డ్రగ్స్ కేసులో బీఆర్ నాయుడు పేరు రావడంతో అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం గత ఆరోపణలను పక్కన పెట్టి బిఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, సిఎం సొంత జిల్లా చిత్తూరుకు చెందిన బిఆర్ నాయుడు పై టీటీడీ చైర్మన్ గా నియామకం తరువాత సైబర్ క్రైం ఫిర్యాదు రావడం మీడియా, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశం అవుతోంది.

ప్రస్తుత సైబర్ క్రైం కేసులో డిసెంబర్ 17 వ తేదిన టీవీ5 ప్రసారం చేసిన ఓ షోలో భారతీయ న్యాయ వ్యవస్థపై వ్యంగ్య, అవమానకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పాటు టీవీ5 కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ.. కోర్టు లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్‌లను టెలికాస్ట్ చేసిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. కోర్టు చేపట్టే చట్టపరమైన చర్యలను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడమే కాకుండా ఈ షోలో సింధూర శివ న్యాయ వ్యవస్థపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదన్న హైకోర్టు కఠిన ఆదేశాలను టీవీ5 విస్మరించడంతో పాటు కాపీరైట్ ఉల్లంఘనలు చేసి టీవీ5 యూట్యూబ్ ద్వారా లైవ్ ప్రసారం చేసి సైబర్ క్రైమ్‌కు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులను కోరారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *