కూటమిలో చేరికల కోల్డ్ వార్..?

ఏపీలో కూటమి పార్టీల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికల సంఖ్య పెరుగుతోంది. ఇది వైసిపిని ఎంతగా బలహీనం చేస్తుందో.. కూటమి ప్రభుత్వ బంధాన్ని కూడా అంతే బలహీనం చేస్తోంది. నియోజకవర్గాల వారీగా కూటమిలో కీలకమైన టీడీపీ జనసేనల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. పొత్తులో ఉంటూనే పొత్తుకు తూట్లు పొడుస్తున్నారంటూ టీడీపీ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాకుండా టీడీపీ అధిష్ఠానం వద్దకు ఆయా నియోకవర్గాల వారీగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఎన్నికల అనంతరం రాజకీయ అవకాశాల పేరుతో వైసిపి నేతలు తొలుత టీడీపీలోకి చేరేందుకు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. అయితే, తమ సొంత నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవకాశాలకు అనుగుణంగా కూటమిలోని 3 పార్టీల్లో ఎందులో చేరాలనేది నేతలు నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బీజేపీ, జనసేనలో చేరికలు టీడీపీ నేతలకు రుచించటం లేదు. తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలో ఎలా చేర్చుకుంటారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ఓటమి తరువాత ఆయా నియోజకవ్గ స్థాయిలో తానే ప్రధాన అభ్యర్థి అనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా ఖంగారు మొదలైంది. వైసిపి నుంచి జనసేనలో చేరుతున్న అభ్యర్థుల వల్ల సదరు నియోజకవర్గాల్లో జనసేన ప్రధాన పోటీదారు అవుతుందని ఇది తనకు, టీడీపీకి భారీ నష్టం చేకూరుస్తుందని అనుచరులతో చర్చించుకుంటున్నారు. అయితే, పవన్ మాత్రం చేరికలపై పక్కా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది. అధికారంలో ఉండగానే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు.

స్వపక్షంలో ఉంటూనే విపక్ష వ్యూహాలు

కూటమి పార్టీల్లో చేరికల వార్ మొదలైంది. వైసీపీ పరాజయంతో ఆ పార్టీ నుంచి కొందరు నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. అదే విధంగా బాలినేని, సామినేని వంటి నేతలు జనసేనలో చేరారు. బాలినేని జనసేనలో చేరిక పైన ఒంగోలు టీడీపీ నేతలు ఇప్పటికీ రాజీ పడటం లేదు. స్థానికంగా టీడీపీ నేతలు ఎవరూ బాలినేనితో కలిసి పని చేసేందుకు సిద్దంగా లేరు. అదే విధంగా ఏలూరులో ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ, స్థానికంగా వచ్చిన అభ్యంతరాలు చర్చగా మారాయి. కూటమిలో ఏ పార్టీకి అభ్యంతరం లేకపోతేనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని గతంలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు.

బీజేపీలోకి వైసీపీ నేత, కూటమిలో చిచ్చుకు మొదటి కారణం ఇదే..!

విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చుకు ప్రధాన కారణమైంది. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. అదే విధంగా తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు జనసేనలో చేరారు. గంజి చిరంజీవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొలుత టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి ఆ తరువాత వైసీపీలో చేరి లోకేష్‌పై ఇష్టానుసారంగా మాట్లాడారు. లోకేశ్‌పై పోటీకి సిద్దమైన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, స్థానికంగా జనసేన ముఖ్య నేతల సిఫార్సుతోనే పవన్ పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీలో చినబాబు టీం గుర్రుగా ఉన్నట్లు సమచారం.

కూటమితో ఉంటూనే టీడీపీకి చెక్.. పవన్ తాజా వ్యూహం

కూటమిలో కలిసుంటూనే జనసేనను బలోపేతం చేయడమే పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది టీడీపీకి ఏ మాత్రం రుచించడం లేదు. కూటమి సమన్వయ కమిటీ నిర్ణయాలను జనసేన బేఖాతరు చేతోందని టీడీపీ సీనియర్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. తాజాగా కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. ఈ పరిణామం కైకలూరు టీడీపీ శ్రేణులకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలోపేతం కావడానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పవన్ నమ్ముతున్నారు. ఆ దిశగా పార్టీలో చేరికల పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కూటమిగానే ఉంటూ మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, నేతల మదిలో ఉంటున్న ఈ ప్రశ్నలు కూటమి స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాల్సిందే. పైకి మాత్రం అంతా బాగున్నా కూటమి పార్టీల్లో చేరికల ముసలం పడుతోందని ఇప్పటికే సీనియర్ నేతలంతా గుర్తించి మసులు కుంటున్నారు. వీటిని ప్రశ్నించే పరిస్థితులు కనిపించటం లేదు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *