కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రెడ్ బుక్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టాలను అతిక్రమించి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేదించారో, వారందరి పేర్లని ఒక బుక్ లో రాసి, వాళ్లకు గుణపాఠం నేర్పుతాం అని టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్ గారు పలుమార్లు చెప్పారు. వైసీపీ కూడా రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని టీడీపీని విమర్శిస్తూ వస్తుంది. కానీ మైలవరం నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన అనుచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను నూతన సంవత్సర సందర్బంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఫోటో వైరల్ అయింది. పాలడుగు దుర్గాప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి పై జరిగిన దాడి కేసులో మరియు టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో జైలుకి వెళ్లి రిమాండ్ అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చారు. సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కాదని వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ ఇస్తే, ఆయన చేసే నిర్వాకం ఇదా అని ఆవేదన చెందుతున్నారు. ఇలా నేతలంతా కులం చూసి కలిసిపోతే, వారి కోసం కొట్లాడిన కార్యకర్తలు బలవ్వాలా అని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ గారు దీని మీద వివరణ అడగాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.