టీడీపీ సీనియర్ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జేసీ మాట్లాడుతూ.. “మీకంటే జగనే నయం కదరా” అన్న వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపుతున్నాయి. కూటమిలో స్వపక్షంగా ఉన్న బీజేపీ నేతలు తన బస్సులను తగలబెట్టారు అంటూ జేసీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉండగా, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ అస్మిత్ రెడ్డి జోక్యం అంటూ ఏమీ ఉండదు. జేసీ చెప్పిన ప్రకారమే తాడిపత్రి నియోజకవర్గంలో అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది. అంత వరకూ ఓకే అయినా సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేస్తుండటం కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది. తాడిపత్రిలో గతంలో మొదలైన ఫ్లై యాష్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది.
గతంలో ఫ్లై యాష్ వ్యవహారంపై కూటమిలో క్లాష్
కడప ఫ్లై యాష్ వ్యవహారంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలను రూపుమాపాలని స్వయంగా సిఎం చంద్రబాబే ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సిఎం పిలిచిన ఈ సంధి సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గైర్హాజరైన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మేల్యే ఆదినారాయణ రెడ్డి సమావేశానికి హాజరై అక్కడి పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు. తర్వాత చంద్రబాబు అనంతపురం జిల్లాకు వెళ్లిన సమయంలోనూ అస్మిత్ రెడ్డి పై ఒకరకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయవద్దంటూ హెచ్చరించారు. ఈ విషయం జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలిసినా ఆయన తీరు మారలేదు. మరోసారి బీజేపీ నేతలపై మండిపడ్డారు. కడపలోనే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు ఉన్నాయి. ఆ వివాదం ఇంకా ముగిసిపోలేదని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
“జగన్ బస్సులను ఆపేసాడు ఆంతే.. మీరు ఏకంగా బస్సులను తగలెట్టేశారు” – జేసి ప్రభాకర్ రెడ్డి
జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సు అగ్నిప్రమాదంలో తగలపడిపోయింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. డిసెంబరు 31న తాను మహిళల కోసం ప్రత్యేకంగా నది ఒడ్డున నూతన సంవత్సర వేడుకలను నిర్వహించానన్న అక్కసుతో బీజేపీ నేతలు తన బస్సులను తగులపెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆ వేడుకలకు వెళ్లవద్దని బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు. తన బస్సులను తగులపెట్టింది బీజేపీ వారేనని, జగనే నయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిని ఇరకాటంలో నెట్టాయి. పోలీసులు కూడా బీజేపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతుండటంతో జేసీని ఆపెదెలా? అని ఇప్పుడు కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా కూటమి పేరుతో ఏపీలో అధికారం దక్కించుకున్న మూడు పార్టీల్లో నేతల మధ్య ఘర్షణలు ఒక్కటిగా బయటపడుతున్నాయి.