రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. అయితే హోంమంత్రి సొంత జిల్లా అయినా అనకాపల్లిలో గత ఎనిమిది నెలల్లో 20కి పైగా పోక్సో కేసులు నమోదవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఎంతగా విఫలమైంది అనడానికి అద్దం పడుతున్నాయి.
ఎలమంచి మండలం లో గత రెండు మూడు వారాలు వ్యవధి లోనే ముగ్గురు చిన్నారులపై లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి, రోలుగుంట మండలం జేసీ అగ్రహారంలో దివ్యాంగ బాలికపై దాడి, రాంబిల్లిలో మైనర్ బాలిక హత్య, అనకాపల్లిలో ఒకటి, నర్సీపట్నంలో ఒకటి ఇలా గత ఎనిమిది నెలలలోనే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 20 పోక్సో కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతల మాట అటుంచితే తన సొంత జిల్లా అయిన అనకాపల్లి లోనే మహిళా హోంమంత్రిగా ఉంటూ మహిళలకు మరియు చిన్నారులకు రక్షణ కల్పించడంలో హోంమంత్రి అనిత గారు ఘోరంగా విఫలమయ్యారు.
గత ప్రభుత్వం హయాంలో మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్ మరియు ఆపత్కాల సమయాలలో భరోసా ఇవ్వడానికి దిశ యాప్ వంటి వాటిని ప్రారంభించారు. అలాగే త్వరితగతిన విచారణ చేపట్టి దుండగులకు కఠిన శిక్షలు విధించే విధంగా జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నెలకొల్పారు. ఈ చర్యలు అన్నిటి వలన నేరస్తుల వెన్నులో వణుకు పుట్టి మహిళలు మరియు చిన్నారులపై అఘాయిత్యాలు గణనీయంగా తగ్గాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దిశా పోలీస్ స్టేషన్లను మూసివేశారు మరియు దిశా యాప్ ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి వాటిని అట్టకెకించారు దీనివల్ల కీచకుల స్వైర విహారం చేస్తూ ఘోరాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేచి దిశ యాప్, దిశా పోలీస్ స్టేషన్లు మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పునరుద్ధరించి నేరస్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే నేరాలు కట్టడి అవుతాయని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.