తిరువూరు, సింగనమల ఎమ్మెల్యేలు మరీ స్పెషల్
ఓ ఎమ్మెల్యేపై కేసు.. మరో ఎమ్మెల్యే అక్రమ దందా..
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల వల్ల కూటమికే కాదు, టీడీపీకీ పరేషాన్
తప్పడం లేదు. మూడు పార్టీల కారణంగా కూటమి ఎఫెక్ట్ అవుతుంటే, సొంత ఎమ్మెల్యేల కారణంగా టీడీపీ ఎఫెక్ట్ అవుతోంది. తాజాగా టీడీపీ అధిష్టానం చేపట్టిన ఓ అంతర్గత సర్వేలో ఇదే విషయం వెల్లడైందని సమాచారం. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరో కాదు కృష్ణా జిల్లా తిరువూరు, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గాల ఎమ్మెల్యేలే. కారణాలు ఏమైనా కొలికపూడి శ్రీనివాసరావును ఇప్పటికే రెండు సార్లు టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి క్రమశిక్షణ సంఘం ఎదుట విచారణను ఎదుర్కొన్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలను వేధించిన వ్యవహారాల్లో పార్టీ సదరు ఎమ్మెల్యేపై కన్నెర్ర జేసింది. ఈ ఆరోపణలు, విచారణలు కూటమి అధికారం చేపట్టిన ఏడు నెలలకే జరగడం పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కీలక సమావేశంలో చర్చ జరిగింది.
ఎమ్మెల్యే కాగానే కొలికపూడిపై కేసు నమోదు
కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన మూడో రోజు ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందిన భవనాన్ని ఎ కొండూరులో స్వయంగా కూల్చేశారు. పోలీసులు అడ్డు వచ్చినా ఎమ్మెల్యే వినలేదు. రోడ్డును ఆక్రమించి ఎ కొండూరు ఎంపీపీ భవనం నిర్మించారని దానిని కూడా కూల్చివేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఒక మహిళ కొలికపూడి వ్యవహారంపై భయపడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మరో వ్యక్తి కూడా కొలికపూడి చేతిలో హింసకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇవి కూడా పోలీస్ కేసులు అయ్యాయి. ఇటీవల డేవిడ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధిస్తున్నారని పోలీసులకు చెప్పిన అంశం కూడా పార్టీలో చర్చకు తెరతీసింది.
సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఆరోపణలు
అనంతపురం జిల్లా సింగనమల కూడా ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బండారు శ్రావణిపై పార్టీ కార్యకర్తలతో పాటు పలువురిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రసాద్ అనే కార్యకర్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తాను 35 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, అయితే ఎమ్మెల్యే బండారు శ్రావణి కావాలనే తనను రేప్ కేసులో ఇరికించారని ఆయన పార్టీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు వల్ల తన జీవితనం నాశనం అయిందని ప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిపంచాలని ఎమ్మెల్యేను కోరాతే ఆ పోస్టును స్థానిక ఎమ్మెల్యే తల్లి వేరే వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో ఈ విషయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్దకు చేరి పంచాయతీ జరిగింది.
మరో వైపు ఎమ్మెల్యే వర్గీయులు కొత్త ఆరోపణలతో తెరముందుకు వచ్చారు. సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇద్దరు వ్యక్తులతో టూ మెన్ కమిటీ వేసి వారు ఎమ్మెల్యేపై పెత్తనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యే అనుచరులు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్ద పంచాయతీ పెట్టారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నర్సానాయుడు, గార్లదిన్నెకు చెందిన మరో సీనియర్ నాయకుడు ముంటి మడుగు కేశవరెడ్డిలతో కలిసి టూ మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వారే ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తూ ఎమ్మెల్యేను ఇబ్బందులు పెడుతున్నారని నియోజకవర్గంలో రచ్చ నడుస్తోంది. ఎట్టకేలకు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నానా యాగీ చేస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు.