ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి తద్వారా విద్యను వ్యాపారంగా మలుచుకున్న తమ పార్టీ నేతలకు లాభం చేకూర్చేలా చూస్తున్నారని, టిడిపి పార్టీ మరియు మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విశాఖపట్నం జిల్లాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
విశాఖపట్నం జిల్లా చినగదిలి మండలం వాడపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు గత కొన్ని నెలలుగా అందుతున్న నాణ్యతలేని మధ్యాహ్న భోజనం పై స్కూల్లో ఉపాధ్యాయులకు మరియు ప్రిన్సిపల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేక పోయేసరికి, విద్యార్థులు తమ తల్లిదండ్రులు సహాయంతో జిల్లా కలెక్టరేట్లో ధర్నా చేపట్టారు. ఆడుతూ పాడుతూ కల్మషం లేకుండా ఉండే చిన్నపిల్లలు ధర్నా లాంటి నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని పిల్లలను అడగగా వారు చెప్పిన సమాధానం అందర్నీ తీవ్రంగా కలచి వేసింది. నాణ్యత లేకుండా ముద్దగా, జావాగ ఉండే అన్నం, పురుగులు పట్టిన కుళ్ళిపోయిన కూరగాయలు, నీళ్ల పప్పు, పురుగులు పట్టిన వేరుశనగలు, వంటి పదార్తాలు ఉపయోగించి, రుచి సుచి లేకుండా భోజనం తయారు చేస్తున్నారని వాపోయారు. ఆ భోజనం తినడం వల్ల వాంతులు విరోచనాలు అయ్యి ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆ తిండి తినలేక స్కూల్లో అక్కడకి అక్కడే పారపోస్తున్నామని వారి ఆవేదన వెళ్లబుచ్చారు. దీనిపై వంట చేసే వారిని నిలదీస్తే, వారు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పిల్లలకు అందవలసిన పోషక ఆహారాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడిన మెనూను, ప్రస్తుత ప్రభుత్వం సరైన పర్యవేక్షణ లేక నీరుగారుస్తుంది అని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల దయనీయ పరిస్థితి చూసిన వారు కూటమి ప్రభుత్వంలో నేతలు వారి పిల్లలకి ఇటువంటి ఆహారాన్ని అందిస్తారా అని ప్రశ్నించారు.
కలెక్టరేట్ కి వచ్చి పోయే వారు, మీడియా పిల్లల తో మాట్లాడడం గమనించిన అధికారులు, హుటాహుటిన డిప్యూటీ డిఈవోని పిలిపించి. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇప్పించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. నాడు–నేడు, ఐబి కరికులం లాంటి విధానాలను ఇప్పటికే తుంగలో తొక్కిన ప్రభుత్వం, మధ్యాహ్న భోజనాన్ని కూడా గాలికి వదిలేసి ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింతగా దెబ్బతీస్తుందని, ఇది కేవలం టిడిపి పార్టీలో మంత్రులుగా మరియు ఉన్నత పదవుల్లో ఉన్నవారి విద్యావ్యాపార ప్రయోజనాలను కాపాడటం కోసమే చేస్తుందని ఆరోపిస్తున్నారు.