సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులపై విమర్శిస్తూ పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెం లోని చైతన్య నగర్ కు చెందిన బోస రమణను ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు అరెస్ట్ చేశారు. రమణ భార్య లక్ష్మి తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనానికి పొదిలి ఎస్.హెచ్.వో తరుఫు న్యాయవాది రమణను అరెస్టు చేయలేదు అని వాదించారు. పిటీషనర్ తరపు న్యాయవాది రమణను అరెస్టు చేశారని నిరూపించడంతో ప్రభుత్వ న్యాయవాది రమణను ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారని అతని స్థానిక కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. దీనితో ఇద్దరు ఎస్.హెచ్.వో లను తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది. అయితే విచారణకు హాజరైన పొదిలి ఎస్.హెచ్.వో రమణను అరెస్ట్ చేసిన విషయం వాస్తవమేనని, సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టినట్టు అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడంతో 41ఏ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేయగా, అతను తీసుకోకపోవడంతో అతని అరెస్టు చేసి అనంతరం విడిచి పెట్టామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఆగ్రహం మరియు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం ఎటువంటి నోటీసులు, రికార్డు లేకుండా ఒక మనిషిని ఇష్టానికి ఎలా అరెస్ట్ చేస్తారు, విడిచిపెడతారు అని ఎస్.హెచ్.వో ని నిలతీసింది. అయితే ఇచ్చాపురం ఎస్.హెచ్.వో ఇది చాలా చిన్న కేసు అని దీనిపై న్యాయస్థానం సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పడంతో, హైకోర్టు పోలీసుల తీరుపై మండిపడింది. ఇది ఒకటే కేసు కాదని రాష్ట్రంలో ఇలా పోలీసులు తమ బాధ్యతలను మరిచి హద్దులు మీరీ ప్రవర్తిస్తున్న అనేక కేసులు తమ దృష్టికి వస్తున్నాయని ఇది ఇలాగే కొనసాగితే ఎస్పీలను, డీజీపీని సైతం కోర్టుకు పిలుస్తామని హెచ్చరించింది. రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు హద్దులు మీరీ ప్రవర్తిస్తే రాష్ట్రంలో పరిస్థితి గాడి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది ఇలా ఉండగా తాజాగా ఇచ్చిన మంత్రుల ర్యాంకింగ్ లలో హోంమంత్రి అనితకు 20వ స్థానం ఇచ్చిన చంద్రబాబు, అనేక సందర్భాల్లో రాష్ట్రంలో పోలీసు శాఖ పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, మహిళలపై వరుస అత్యాచార ఘటనలు జరగడం పై సీరియస్ అయిన ముఖ్యమంత్రి అనేకసార్లు ఉన్నత పోలీస్ అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా పోలీసుల పనితీరు మరియు హోంమంత్రి అనిత పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే పోలీస్ యంత్రాంగం మరియు అధికారులు మాత్రం ఇవేవీ పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు దీనికి పోలీస్ శాఖలో కీలక పోస్టింగులు మరియు ప్రమోషన్స్ విషయం మొత్తం చిన్నబాబే చూస్తుండడం కారణంగా తెలుస్తోంది.
అందుకే ఇప్పటికే చంద్రబాబు మరియు పవన్ని లైట్ తీసుకున్న పోలీస్ యంత్రాంగం, తమ దృష్టి అంతా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ, చిన్నబాబు ని ప్రసన్నం చేసుకోవడం పైనే పెట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే తాజాగా ఈ భక్తి మితిమీరి సాక్షాత్తు హైకోర్టు ధర్మాసనం చివాట్లు పెట్టినా, పోలీసులు పట్టించుకోకుండా ఉండడం రాష్ట్రంలో పరిపాలన మరియు శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా మారిందనడానికి అద్దం పడుతుందని విపక్ష పార్టీలు మరియు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.