పోలీసుల చుట్టూ గట్టి ఉచ్చు బిగించింది హైకోర్టు! అధికారం దాటి ప్రవర్తించిన కర్నూలు త్రి-టౌన్ పోలీసులు, విచక్షణ లేకుండా అరెస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మేజిస్ట్రేట్‌లపై హైకోర్టు బాగా మండిపడింది. ప్రేమ్‌కుమార్ అక్రమ నిర్బంధంపై విచారణ జరుపుతూ, జస్టిస్ రావు రఘునందన్ రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మధ రావు ఏప్రిల్ 8 లోగా అన్ని డాక్యుమెంట్లు తీసుకురావాలని ఆదేశించారు.
పోలీసుల తీరుతో మాకు రక్తపోటు పెరుగుతోంది!” అంటూ కోర్టు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. “ఎవర్నయినా అరెస్ట్ చెయ్యాల్సిందేనన్నట్టుగా కేసులు పెట్టడం, ఫేక్ స్టేట్‌మెంట్లతో నిందలు వేయడం” పోలీసుల కొత్త ట్రెండ్ అయ్యిందని కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. ప్రేమ్‌కుమార్‌ను కేవలం ₹300 ఉండే సోషల్ మీడియా రీల్ కారణంగా అరెస్ట్ చేయడం పై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. “ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శించడం నేరమా? అలా అయితే ప్రతి యాక్టర్, డైరెక్టర్ జైల్లో ఉండాలి!” అంటూ మండిపడింది.
ఇంకా షాకింగ్ ఏమిటంటే, కర్నూలు పోలీసులు అర్ధరాత్రి 8-9 గంటలు ప్రయాణించి గుంటూరులో ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడం. అది కూడా లోకల్ పోలీసులకు చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా! “కర్నూలు పోలీసులకు గుంటూరులో ఏమాత్రం అధికారం ఉంది? అనుమతి తీసుకున్నారా?” అంటూ కోర్టు కరాఖండిగా ప్రశ్నించింది. పైగా సాక్షులను కూడా కర్నూలు నుంచే తీసుకురావడం పోలీసుల కుట్రను బయటపెట్టింది. “మేము కోర్టులో కూర్చున్నాం కాబట్టి మీ ఆటలు మాకు అర్థం కావవని అనుకోవద్దు!” అంటూ పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
కేవలం పోలీసుల మీదే కాదు, మేజిస్ట్రేట్‌లమీద కూడా హైకోర్టు అగ్గిమీద గుగ్గిలమైంది. “అరెస్టులకి ఓకే చెప్పే ముందు మేజిస్ట్రేట్‌లు కనీసం డాక్యుమెంట్లు కూడా చూసుకోవట్లేదా?” అంటూ కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రేమ్‌కుమార్ కేసులో కర్నూలు మేజిస్ట్రేట్, అతనిపై నకిలీ ఆరోపణలను పట్టించుకోకుండా పునరావృత నేరస్తుడిగా ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. “కర్నూలు త్రి-టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి (SHO) మరియు మేజిస్ట్రేట్ తమ రికార్డుల్ని సమర్పించాలి!” అని తేల్చి చెప్పింది.
ఇదంతా చూస్తున్న అడ్వకేట్ వెలురి మహేశ్వర రెడ్డి, కోరటిపాటి అభినయ్ తరపున వాదిస్తూ, “పోలీసుల స్వేచ్ఛా రాజ్యాన్ని అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక ప్రభుత్వ అడ్వకేట్ విష్ణుతేజ అర్ధంకాని వాదనలు పెట్టినప్పటికీ, కోర్టు వాటిని త్రిప్పికొట్టింది.
ఇప్పటికి hearing ఏప్రిల్ 8కి వాయిదా పడింది. కానీ హైకోర్టు ఉగ్రరూపం చూస్తుంటే, పోలీసులకు, మేజిస్ట్రేట్‌లకు కష్టాలు ఖాయం!